Home » Health » ఇయర్ ఫోన్ లు వాడుతుంటారా?  ఈ నిజాలు తెలుసా?


 

ఇయర్ ఫోన్స్ ఇప్పటి ప్రజల జీవనశైలిలో భాగం అయిపోయాయి.  ఉదయాన్నే వాకింగ్,  జాకింగ్ చేస్తున్నా,  ప్రయాణాలు చేస్తున్నా,  ఎవరితో అయినా ఫోన్  మాట్లాడుతున్నా.. ఇలా చాలా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది.  ఇక నిరంతరం ఫోన్ లు మాట్లాడే వృత్తి లేదా వాతావరణంలో ఉండే వారు రోజులో చాలా గంటల సేపు ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు.  ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ లు రిసీవ్ చేసుకుని మాట్లాడటానికి వీలు లేని వారు కనీసం ఒక చెవికి అయినా ఇయర్ ఫోన్ లేదా ఇయర్ బడ్ పెట్టుకుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు.  చాలా మంది రోజులో 10-12 గంటలు ఇయర్ ఫోన్స్ మాట్లాడుతూ గడిపేస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే పెద్ద సౌండ్స్ తో ఇయర్ ఫోన్స్ వాడేవారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

ఇయర్‌ఫోన్ వాడకం వల్ల వినికిడి ఆరోగ్యంపై ప్రభావం పెరుగుతోంది. "70 డెసిబెల్స్ (dB) కంటే ఎక్కువ శబ్ద స్థాయిలకు ఎక్కువ కాలం గురికావడం శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే 100 dB కంటే ఎక్కువ శబ్దాలకు అకస్మాత్తుగా గురికావడం తక్షణ చెవుడుకు కారణమవుతుంది." రద్దీగా ఉండే వీధులు,  80-100 dB ట్రాఫిక్, 120 dB కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే కచేరీలు లేదా పటాకులు మోత మొదలైన వాటి కారణంగా శబ్ద స్థాయిలు పెరుగుతాయి.  ఇది వినికిడి లోపానికి కారణమవుతుంది. వీటికి తోడు ఇయర్ ఫోన్ ల వాడకం పెరిగితే తీవ్రమైన సమస్యలు వస్తాయి.

ఇయర్ ఫోన్స్ నేరుగా చెవి లోకి ధ్వనిని పంపుతాయి, దీని వలన వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మంది  తెలియకుండానే తీవ్రమైన శబ్దానికి గురవుతారు. తరచుగా ఎక్కువసేపు సంగీతం లేదా కాల్‌లను ఎక్కువసేపు వింటారు. మరికొందరికి సంగీతం అనేది ఎక్కువ శబ్దం పెట్టుకుని ఆస్వాదించడం అనే అలవాటు కూడా ఉంటుంది.  " 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లలో ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది".

రూల్ ఆఫ్ 60 అంటే..

"60 నియమం" అంటే శబ్దాన్ని  60% కంటే తక్కువగా ఉంచడం.  ఇయర్‌ఫోన్ వినియోగాన్ని రోజుకు 60 నిమిషాలకు మించకుండా పరిమితం చేయడం. అదనంగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు సురక్షితమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే అవి ఇన్-ఇయర్ పరికరాలు చేసే విధంగా చెవి లోకి ధ్వనిని లోతుగా ప్రసారం చేయవు.

అధిక వాల్యూమ్ నష్టం..

ఎక్కువసేపు 85dm కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని వింటే, అది శాశ్వత వినికిడి లోపానికి కారణమవుతుంది.

ఇయర్‌ఫోన్‌లను విరామం లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల చెవికి ఒత్తిడి వస్తుంది, దీని వలన అసౌకర్యం,  తాత్కాలిక వినికిడి లోపం సంభవించవచ్చు.

హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఇయర్‌బడ్‌లు కర్ణభేరికి దగ్గరగా ఉంటాయి. ఇది ధ్వని ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది.  దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది.

బిగ్గరగా సంగీతం వినడమే కాకుండా, ఇయర్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వడం,  ఇతరులవి తీసుకుని వాడటం వంటివి  లేదా ఎక్కువసేపు వాడటం వల్ల కూడా చెవిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.


                                           *రూపశ్రీ.